పాస్‌బుక్స్ లేకుండానే పంట రుణాలు! రూ.13 వేల కోట్ల గోల్‌మాల్‌

రుణమాఫీ.. సాగు చేసే రైతన్నకు ఎలాంటి కష్టం రాకూడదని ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగునింపిన ఈ నిర్ణయాన్ని.. కొందరు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ సంక్షేమ పథకాన్ని అడ్డుగా పెట్టుకొని లక్షలు వెనకేసుకున్నారు. రుణమాఫీ తర్వాత ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి తెప్పించుకున్న డేటాను డీకోడ్ చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఎలాంటి పాస్‌బుక్స్ లేకుండానే వేల కోట్ల క్రాప్‌ లోన్లను మంజూరు చేసినట్టు గుర్తించారు. ఏకంగా 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 13 వేల 419 కోట్ల క్రాప్‌ లోన్లను మంజూరు చేసినట్టు గుర్తించారు.గతేడాది రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం.. క్రాప్ లోన్ల వివరాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకర్లను కోరింది. అయితే ఇందులో పాసు పుస్తకాలు కూడా లేకుండా ఇచ్చిన క్రాప్‌లోన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నకిలీ పాస్ బుక్స్ పెట్టి కొన్ని, ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్ బుక్స్ పెట్టి మరికొన్ని, అసలు పాస్ బుక్స్ కూడా లేకుండా ఇంకొన్ని రుణాలు పొందినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. అక్రమ ముఠాలతో పాటు కొందరు బ్యాంక్ అధికారులు కుమ్మక్కైలో వేల కోట్ల క్రాప్‌లోన్లను కొల్లగొట్టినట్టు గుర్తించింది. ఈ అక్రమ పంట రుణాలపై ప్రభుత్వం ఇంటర్నల్‌గా ఎంక్వైరీ చేయిస్తున్నట్టు సమాచారం. బ్యాంకులు కూడా ఏ మేనేజర్ ఉన్నప్పుడు ఆ క్రాప్లోన్లు మంజూరు చేశారనే దానిపై వివరాలు తీస్తున్నట్టు తెలిసింది.ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ధైర్యంతోనే అక్రమార్కులు బ్యాంకర్ల కలిసి ఈ తరహా దోపిడికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. లక్ష పంట రుణం తీసుకుంటే, అందులో 60:40 రేషియోలో అక్రమార్కులు, బ్యాంకర్లు పంచుకుంటున్నారు. ఇటీవల రుణమాఫీ సందర్భంగా ప్రభుత్వం లబ్ధి పొందిన రైతులకు మెసేజ్ పంపించడంతో క్రాప్‌ లోన్‌ తీసుకోకున్నా తమకు మెసేజ్ వచ్చిందని కొందరు చెప్పడంతో ఇలాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 32 బ్యాంకులు, 3 వేల 992 బ్రాంచ్‌ల నుంచి పంట రుణాల వివరాలు సేకరిస్తే వేల కోట్లు ఉన్నట్టు తేలింది. అసలు పట్టాదారు పాసు పుస్తకం తనఖా పెట్టుకోకుండా, నేరుగా ఆన్‌లైన్లోనే వివరాలను యాక్సెస్ చేసి ఆ భూములకు పంట రుణాలు ఇచ్చే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇదే ఇప్పుడు కొందరు బ్యాంకర్ల పాలిట వరంగా మారింది.